ఎందుకు సినిమా వాళ్ళంతా “వెబ్ సైట్స్”పై పడుతున్నారు? | FZ News

srinivas reddy, comments on web reviews, trivikram, a aa movie, nithiin, samantha

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీ సభ్యులు ‘వెబ్ సైట్స్ మరియు సోషల్ మీడియా’లపై బాగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనపడుతోంది. ఒకప్పుడు పూరీ జగన్నాధ్ తన ‘నేనింతే’ సినిమా ద్వారా సినీ విశ్లేషకుల పై ఉక్కుపాదం ఎక్కుపెట్టగా, ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ మరోసారి వెబ్ సైట్స్ సమీక్షలపై బహిరంగంగానే మండిపడ్డారు. తాజాగా కమెడియన్ శ్రీనివాస రెడ్డి వంతు! ‘అ…ఆ…’ సక్సెస్ సంబరాలకు వచ్చిన తరుణంలో… వెబ్ సైట్ సమీక్షలను ఉద్దేశిస్తూ… రేటింగ్ ల విషయంలో త్రివిక్రమ్ పూర్తిగా నిరుత్సాహ పడ్డారని, అయితే ప్రేక్షకులు పట్టం కట్టారని, ఇప్పుడు వారంతా ‘బంతిని’ పీసుక్కోండి… ఏ బంతి కావాలంటే ఆ బంతిని పీసుక్కోవచ్చు అంటూ… కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

ఈ మాటలు శ్రీనివాస్ రెడ్డే పలికినప్పటికీ, వెనుక ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ కనపడడంతో… దాదాపుగా కమెడియన్ వ్యాఖ్యలను త్రివిక్రమ్ తదితరులు కూడా బలపరిచినట్లయ్యింది. మరోవైపు సమంత ఏకంగా ఒక వెబ్ సైట్ పేరు చెప్పి… తనను బాగా ప్రశంసించిందని తన అనుభూతులు చెప్పుకొచ్చింది. నయానో, భయానో… సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా పలు వెబ్ సైట్స్ ను బాగా కూలంకుషంగా అనుసరిస్తున్నట్లు అర్ధమవుతోంది. 

అయితే అసలు ఎందుకు ఈ సినీ పెద్దలంతా ‘వెబ్ సైట్స్’కు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? నిజంగానే ఒక సినిమా రివ్యూ వీక్షకులపై అంత ప్రభావం చూపుతుందా… అంటే ఖచ్చితంగా! అని చెప్పవచ్చు. 

ఏదైనా ఒక సినిమాను చూడాలి… అనుకున్న వాళ్ళు ఇలాంటి విశ్లేషణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు గానీ, కాస్త అటు ఇటుగా ఉన్న వారిపై మాత్రం ఈ విశ్లేషణలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అర్ధమవుతోంది. 

అయితే తమకు అనుకూలంగా ఉన్నపుడు మాత్రం సదరు వెబ్ సైట్ లింక్ లను షేర్ చేసుకుంటూ, తనకు అనుకూలంగా లేనపుడు మాత్రం మండిపడడం… ఏ హీరో, దర్శకుడు, కమెడియన్ కైనా తగునో కాదో ఒక్కసారి పునరాలోచించుకోవాలి. అంతేకదా… అందరికీ భజనే కావాలి..! అందుకే ‘సినీ ఇండస్ట్రీ’ని ‘భజన పరిశ్రమ’గా కూడా అభివర్ణిస్తుంటారు.

Source: Mirchi9

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top