క‌థ::అమ్మకు ప్రేమతో... | FZ News

                                                                        అమ్మకు ప్రేమతో... 
                                                                       - అలపర్తి రామకృష్ణ

‘‘పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావే? తలంతా నెరిసిపోయాక... కాళ్ళూ చేతులూ చచ్చుబడ్డాక పెళ్ళి చేసుకుంటావా? నీ స్నేహితురాలు అరుణ కూతుర్ని కాన్వెంట్‌కు నడిపించుకుంటూ వెళ్తూ ఉంది. నువ్వే ఇంకా కంప్యూటర్‌ ముందు కూర్చుని కాళ్ళు ఆడిస్తూ ఉంటావ్‌’’ అంది వసుమతి కూతురితో.
కూర్చుని కాళ్ళు వూపడం అమ్మకు నచ్చదని సుప్రజకు తెలుసు. కావాలనే తల్లి చూస్తున్నప్పుడు కాళ్ళు వూపుతూ కూర్చుంటుంది. కాళ్ళు వూపితే మేనమామలకు కలిసిరాదట... ఇబ్బందుల పాలవుతారట! ‘‘మీ అన్నగారు నిక్షేపంగా పాతిక ఎకరాల మాగాణి సాగుచేసుకుంటూ అంగలూరులో దర్జాగా ఉన్నాడు. ఆయన కొడుకేమో అమెరికాలో పెద్ద ఇంజినీరు. ఏం ఇబ్బందులు వచ్చాయి మేనమామకు?’’ అంటుంది సుప్రజ పెళ్ళిమాట దాటవేస్తూ.

ఇప్పుడు ఆ సమాధానం చెప్పాలనుకోలేదు సుప్రజ.
పెళ్ళికి సిద్ధమే! మొన్నటిదాకా చదువు మధ్యలో ఆగిపోతుందని పెళ్ళికి ఒప్పుకోలేదు. ఎంటెక్‌ చదివింది... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తోంది. తన కాళ్ళమీద తను నిలబడింది. పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరంలేదిప్పుడు.

‘‘ఇప్పటికిప్పుడు తాళిబొట్టు కట్టించుకోమన్నా కూడా నేను సిద్ధమే! నాకు కూతురు పుట్టాక నువ్వే మనవరాలిని కాన్వెంటుకు నడిపించుకుంటూ తీసుకువెళ్ళాలి’’ అంది సుప్రజ నవ్వుతూ. కూతురు పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఎంతో ఆనందపడింది.
‘‘నీకు ఇద్దరు బావలున్నారు. ఎవరిని చేసుకుంటావ్‌?’’ అడిగింది వసుమతి. ఉలిక్కిపడింది సుప్రజ.

అప్పటివరకూ పెళ్ళి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని పెళ్ళి చేసుకోవాలన్న విషయం గూర్చి తీవ్రంగా ఆలోచించలేదు.

...ఇద్దరూ అందగాళ్ళే... మనసును తాకినవాళ్ళే! ఎవరిపట్లా వ్యతిరేకభావం లేదు. తనంటే వాళ్ళిద్దరికీ అమితమైన ప్రేమ. ఎవరూ హద్దులు మీరలేదు. వెకిలి చేష్టలు చేయలేదు. తనముందు వాళ్ళ మనసులోని ప్రేమను వ్యక్తపరచలేదుగానీ, ఇద్దరూ హృదయాల్లో ప్రేమమందిరం కట్టుకుని తనను ఆ మందిరంలో నిలపడానికి సిద్ధంగా ఉన్నారు.

తను వాళ్ళ కోరికను మన్నించకపోయినా మరొకరిని పెళ్ళి చేసుకున్నా నిండు మనసుతో దీవించే సహృదయం ఉన్నవాళ్ళు. ఇద్దరినీ కాదని మరొకరిని భర్తగా వూహించే మనఃస్థితి తనకూ లేదు.

ఎవరి ఒడిలో చేరి మోహనరాగం వినిపించాలి? పెద్ద సమస్య వచ్చిపడిందే! ఇద్దరు బావలూ కళ్ళముందు మెదిలారు.

దరహాస్‌... వసుమతి అన్నగారి కొడుకు. అమెరికాలో ఎంఎస్‌ చేశాడు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఇంజినీరు. ఆరడుగుల పొడుగు... మాటలూ చేతలూ డిగ్నిఫైడ్‌గా ఉంటాయి. పేరుకు తగ్గట్టు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడేస్తూ ఉంటాడు. ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదు.

రెండో బావపేరు అనురాగ్‌... సుప్రజ మేనత్త కొడుకే! భార్గవ చెల్లెలు సంధ్యావళి కొడుకు. ఇంటర్‌లోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. తండ్రి చీకటిపడ్డాక పొలం నుంచి వస్తూ పొరపాటున త్రాచుపాము మీద కాలు వేశాడు. పాము కాటేసింది. కాలుకు తుండుగుడ్డ బలంగా కట్టుకుని వూళ్ళొకి మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. అప్పటికే విషం ఒంటినిండా పాకిపోయింది. ఇంటి గుమ్మం దగ్గరే పడిపోయి ప్రాణాలు విడిచాడు. సంధ్యావళి నిండు గర్భిణి ఆ సమయంలో. అనురాగ్‌ను ప్రసవించాక నెలరోజులు తిరక్కముందే భర్త చనిపోయాడన్న దిగులుతో చనిపోయిందామె.

చదువు అబ్బకపోవడంతో వ్యవసాయం మీద మక్కువ పెంచుకున్నాడు అనురాగ్‌. పాత సినిమాల్లో ఎన్టీఆర్‌లా ఉంటుంది రూపం. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం. పంటలు పండకపోయినా, పండిన ఏడాది సరైన గిట్టుబాటు ధర రాకపోయినా కుంగిపోకుండా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపోతూ ఉంటాడు. సానుకూల ఆలోచనలతో చుట్టూ చేరిన వారిని ఉత్సాహపరుస్తూ ఉంటాడు. 

తనతో ఎక్కువగా మాట్లాడడుగానీ వేసవి ఎండలకు వేడెక్కి నెర్రెలిచ్చిన భూమిపై తొలకరి జల్లులుపడ్డట్లుగా ఉంటుంది అతన్ని చూసినప్పుడు. జున్నుపాలు, ఉలవచారు తీసుకు వస్తుంటాడు వూరి నుంచి హైదరాబాద్‌ వచ్చినప్పుడు. అతను చదువుకోకపోయినా చదువుకున్నవాళ్ళంటే వల్లమాలిన అభిమానం. తనవైపు ఆరాధనగా చూస్తూ ఉంటాడు వచ్చినప్పుడు.

ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మైస్పేస్‌ ఫ్యామిలీ హ్యాంగ్‌అవుట్‌తో దరహాస్‌ అందరితో అనుబంధం పెంచుకుంటూ ఉంటే... అనురాగ్‌ బస్సులో పరిచయం అయిన వ్యక్తుల్ని కూడా వదలడు. వాళ్ళ అడ్రస్‌, ఫోన్‌ నంబర్లు తీసుకుని అనుబంధాలను పెంచుకుంటూ ఉంటాడు.


ఉద్యోగరీత్యా ఎన్నో దేశాలు తిరిగాడు దరహాస్‌. ప్రపంచాన్ని చుట్టేసిన అనుభవం అతనికి ఉంటే, జీవితం గుట్టు తెలిసినట్లు అనురాగ్‌ కన్పిస్తాడు.

‘‘ఎవరిని పెళ్ళి చేసుకుంటావంటే మాట్లాడవేమిటే?’’ మళ్ళీ అడిగింది వసుమతి కూతుర్ని.
‘‘నువ్వే చెప్పు... ఎవరిని చేసుకోమంటే అతన్నే పెళ్ళి చేసుకుంటాను’’ అంది సుప్రజ. ‘‘బాగానే ఉంది సంబడం- కాపురం చేసేది నువ్వా నేనా? చదువుకున్న అమ్మాయివి... ఎవరిని పెళ్ళి చేసుకోవాలో కూడా నిర్ణయించుకోలేవా ఏం?’’ ‘‘నువ్వు స్పష్టంగా చెప్పమ్మా, నీ మాటే ఫైనల్‌! నీకంటే నా శ్రేయస్సు ఎక్కువగా కాంక్షించేవారు ఎవరున్నారు?’’ కూతురికి ఏదో చెప్పాలనుకుందిగానీ, ఆ మాటలు గొంతులోనే ఆగిపోయాయి.
అసహనంగా అటూ ఇటూ చూసింది వసుమతి.

‘‘నువ్వూ, మీ నాన్నగారూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి. నీ బావలిద్దరిలో ఎవరిని చేసుకున్నా నాకు ఇష్టమే!’’ అనేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. రైలు నిలయం నుంచి భార్గవ రాగానే కూతురు పెళ్ళికి ఒప్పుకుందని చెప్పేసింది. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌లో అధికారి అతను. సంతోషపడ్డాడు భార్గవ.

‘‘మనింట్లో పెళ్ళి సందడి మొదలవ్వబోతున్నదన్నమాట... మీ అమ్మ నాన్నాలను వెంటనే రమ్మని కబురు చెయ్యి! దరహాస్‌తో నేను మాట్లాడతాను. వాడికి ఎప్పుడు సెలవులు ఉన్నాయో కనుక్కోవాలి కదా! బ్రాహ్మణుడిని పిలిచి ముహూర్తాల వివరాలు కనుక్కుందాం’’ అనేశాడు హడావుడిపడుతూ.

‘‘లేడికి లేచిందే ప్రయాణం- అన్నట్లుంది మీ పద్ధతి. అమ్మాయి ఎవరిని పెళ్ళి చేసుకోవాలనుకుంటోందో ముందు అడిగి చూడండి. మీ అభిప్రాయం ఏమిటి... మనింటి అల్లుడు ఎవరైతే బాగుంటారు?’’ భర్తను అడిగింది.

‘‘ఎంఎస్‌ చదువుకున్న కుర్రాడికి ఎంటెక్‌ చదివిన అమ్మాయి బెస్ట్‌! రేపు అమెరికాలో మన అమ్మాయిక్కూడా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. ఎంత మంచివాడైనా చదువులేనివాడికి అమ్మాయిని ఇవ్వలేంగా’’ అన్నాడతను.
ఎవరిని ఉద్దేశించి చదువులేనివాడని అంటున్నాడో వసుమతికి అర్థం అయింది.
మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు.
భార్య భుజం మీద చేయివేసి దగ్గరకు తీసుకుని ‘‘మీ అన్న కొడుకేగా దరహాస్‌... అందరికంటే నువ్వు ఎక్కువగా సంబరపడాలి! ఆ సంతోషం నీ మొహంలో కన్పించడంలేదేమిటీ?’’ అడిగాడు భార్గవ.
‘‘అమ్మాయి మీమాట కాదనదు. మీమాట ఫైనల్‌... మీరు ఎవరితో అంటే వాళ్ళతోనే అమ్మాయి పెళ్ళి జరుగుతుంది’’ అంది ఆమె.

‘‘నా మనసులోని మాట చెప్పానుకానీ ‘నామాటే ఫైనల్‌’ అని నేను అనడంలేదు. అమ్మాయి మీద ఒత్తిడి కూడా తీసుకురాను. అమ్మాయికి అన్నివిధాలా దరహాస్‌ తగిన వరుడని నా అభిప్రాయం. కాదూ అనురాగ్‌నే చేసుకుంటానన్నా, వీళ్ళిద్దరినీ కాక మరొకరెవర్నో ప్రేమిస్తున్నాను... అతన్నే పెళ్ళి చేసుకుంటానని సుప్రజ చెప్పినా ఆనందంగా అమ్మాయి నిర్ణయాన్ని గౌరవిస్తాను’’ అన్నాడు భార్గవ.
వాళ్ళిద్దరి మాటలూ వింటూనే ఉంది సుప్రజ.
అమ్మ చూపులు గోడకు వేలాడదీసిన అనురాగ్‌ తల్లిదండ్రుల ఫొటోమీద నిలిచి ఉండటం గమనించింది సుప్రజ. తల్లి కళ్ళలో నీటి చెలమ కన్పించింది.

                                                                             * *

వసుమతికి పెళ్లైన కొత్తల్లోనే భార్గవ చెల్లెలు సంధ్యావళి కొడుకును కని చనిపోయింది. చనిపోయేముందు ఆ పసిగుడ్డును వసుమతి చేతుల్లో ఉంచి ‘‘నీ కొడుకే అనుకుని పెంచి పెద్దవాడిని చెయ్యి వదినా! తండ్రి కూడా లేడు. అన్నయ్యా, నువ్వూ మీ పిల్లలతో సమానంగా పెంచండి. వీడు మీకు ఆర్థికంగా భారం కాడు. మావారి పేరుమీద ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అవన్నీ వాడికే చెందుతాయి’’ అంది సంధ్యావళి తడుస్తున్న కళ్ళతో.

‘‘అనవసరంగా కంగారుపడకు... నీకు నయం అవుతుంది. నీ కొడుకును నువ్వే పెంచుతావు. నాకు కూతురు పుడితే నీ కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేస్తాను’’ పక్కనే నిలబడ్డ భార్గవ చెల్లెలికి ధైర్యం చెబుతూ అన్నాడు.
తమ్ముడి మాటలు కొండంత ధైర్యం కలిగించాయిగానీ సంధ్యావళి ప్రాణం నిలుపలేకపోయాయి. ఆమె చనిపోయాక అనురాగ్‌ను హైదరాబాద్‌ తీసుకువచ్చి పెంచింది వసుమతి.

‘‘మనకు పెళ్ళై రెండునెలలు కూడా కాలేదు. అప్పుడే మనిద్దరిమధ్యా ఈ పసిపిల్లాడు ఏమిటి? సంధ్యావళి అత్తమామల దగ్గర ఈ కుర్రాడిని వదిలేద్దాం. అనవసరంగా పిల్లాడిని మనం తీసుకువచ్చాం’’ అనేవాడు భార్గవ రాత్రిపూట. అనురాగ్‌ను ఎత్తుకుని బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఉండేది వసుమతి. ‘‘మనం ఆనందంగా గడపాల్సిన సమయాన్ని వీడు పాడుచేస్తున్నాడు’’ అంటూ విసుక్కునేవాడు.
భర్త మాటలు పట్టించుకోకుండా ఆ బిడ్డను గుండెలకు హత్తుకునేది. అమాయకంగా వాడు నవ్వుతుంటే ఆనందంతో పొంగిపోయేది.

అనురాగ్‌ ఏడుస్తున్నప్పుడు విసుక్కున్నా, భార్య తన చెల్లెలు కొడుకును కన్నబిడ్డలా చూడటం మనసుకు తాకేది. ‘నా భార్య ఏమిటో నాకు తెలుసు’ అనుకునేవాడు. సుప్రజ పుట్టాక కూడా అనురాగ్‌ మీద ఆమె అనురాగం సన్నగిల్లకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మతనం చూసి కరిగిపోయాడు. ఆ పిల్లలిద్దరికే కాదు, తనక్కూడా వసుమతి అమ్మే అనుకునేవాడు- ఆమె తనకు చేసే సపర్యలు చూసి. తన ఆరోగ్యం కంటికి రెప్పలా కాపాడే ఆమె అంటే అనురాగం మరింత ఎక్కువైంది.

అయితే సుప్రజ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా ఏమీ లేదు. చిన్నప్పటి నుండీ అందరినీ గమనిస్తూనే ఉంది. మంచి మనుషుల మధ్య తన బాల్యం గడవడం అదృష్టంగా భావించేది.
అందరిమీదా స్పష్టమైన అవగాహన ఉంది ఆ అమ్మాయికి.

‘తనకోసం చేసిన పనులు కొంతకాలం సంతోషాన్ని కలిగిస్తాయి, ఇతరుల కోసం చేసిన పనులు శాశ్వతంగా ఆనందాన్ని పంచుతాయని అనుకునే అమ్మ, భార్యను గౌరవించే తండ్రి, అందరి ఆనందమే తన ఆనందంగా భావించే దరహాస్‌, అనురాగం ఆప్యాయతలను పంచే అనురాగ్‌... వీళ్ళంతా తనకు అయినవాళ్ళు కావడం నిజంగానే తన అదృష్టం’ అని మరోసారి అనుకుంది.
చిన్నప్పటి సంఘటనలు కళ్ళముందు మెదిలాయి.
తనకంటే అనురాగ్‌నే ఎక్కువగా ముద్దుచేసేది అమ్మ. లంకెబిందె దొరికినంత సంతోషం అనురాగ్‌ను చూస్తుంటే! రాత్రిళ్ళు ఆమె మెడచుట్టూ చేతులు వేసి నిద్రపోయేవాడు.
తనకంటే అనురాగ్‌ రెండేళ్ళు పెద్ద.
తనను పక్కకు నెట్టేసి, అమ్మ పక్కన చేరడం నచ్చేది కాదు. చలి వేస్తున్నప్పుడు గువ్వపిట్టలా ఒదిగిపోయి అమ్మ డొక్కల్లో దూరి పడుకోవాలనిపించేది. అనురాగ్‌ తాత, నానమ్మలు వచ్చి వాడిని ఎక్కడ తీసుకు వెళ్ళిపోతారోనని బెంగపడేది అమ్మ.
‘‘చలిగా ఉంది... నీ పక్కన పడుకుంటా! వాడిని వేరే మంచం మీద పడుకోబెట్టు’’ అనేది అమ్మతో తను.
‘‘చలి వేస్తే రగ్గు కప్పుకుని పడుకో. వేరే మంచంమీద పడుకోవడం వాడికి అలవాటు లేదు’’ అనేది అమ్మ తన మాటలు పట్టించుకోకుండా. ఇంట్లో ఏది చేసినా అనురాగ్‌కే ముందు పెట్టేది. 

తను పుస్తకం ముందు పెట్టుకుని కూర్చుంటే అనురాగ్‌ తూనీగలా ఎగురుతూ ఆడుకుంటూ ఉండేవాడు. మార్కులు తక్కువ వచ్చేవి. నాన్న చేత దెబ్బలు తింటూ ఉండేవాడు. ‘‘చదువుకోకపోతే ఎలారా నాన్నా?’’ అడిగేది అమ్మ.
‘‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి అత్తా! వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలి. మొగుడి సంపాదన మీద ఆధారపడకూడదు. మగవాళ్ళకు చదువు రాకపోయినా ఫరవాలేదు. వ్యవసాయం చేసి బతకొచ్చు, మెకానిక్‌ షాపులో పనిచేసి కడుపు నింపుకోవచ్చు’’ అనేవాడు అనురాగ్‌.
పదో తరగతి బొటాబొటిగా మార్కులు తెచ్చుకుని పాస్‌ అయ్యాడు. ఇంటర్‌లో చేరాడుగానీ పుస్తకం ముట్టుకునేవాడు కాదు. నాన్నకు కోపం వచ్చేది. మేనల్లుడిని చితక్కొట్టేవాడు. 
‘‘నేను- మా తాత, నానమ్మల దగ్గరికి వెళ్ళిపోతాను. పొలాలు ఉన్నాయి మాకు... రైస్‌మిల్లు ఉంది. మా తాత పెద్దవాడయ్యాడు... అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాడు. నన్ను వాళ్ళ వూరు వచ్చేయమని గొడవ చేస్తున్నాడు. నేను మా వూరు వెళ్ళిపోతా’’ అన్నాడు అనురాగ్‌ నాన్న ఎదుట నిలబడి. ‘‘చదువుకోనప్పుడు ఇక్కడ ఎందుకు... వెళ్ళిపో’’ అన్నాడు నాన్న. 
తాతగారి వూరు వెళ్ళినా నెలరోజులకు ఒకసారి హైదరాబాద్‌ రావాల్సిందే... అమ్మ పక్కన చేరి కబుర్లు చెప్పాల్సిందే! ‘‘నీ చేతిముద్ద తిని చాలా రోజులైంది... అన్నం పెట్టు అత్తా’’ అనేవాడు. అమ్మ ముద్దలు కలిపి పెడుతూ ఉండేది.

సొంత అన్న కొడుకు దరహాస్‌ సెలవుల్లో ఇంటికి వచ్చినా అతన్ని పట్టించుకునేది కాదు. దరహాస్‌కు నాన్న దగ్గర చనువు ఎక్కువ. చదువు, ఉద్యోగ విషయాలు నాన్నతో చర్చిస్తూ ఉండేవాడు.
‘‘మా అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకుంటే మేము కూడా అమెరికా వచ్చి అక్కడి ప్రదేశాలు చూడొచ్చు’’ అన్నాడు నాన్న ఓరోజు దరహాస్‌తో.
‘‘సుప్రజ నన్ను చేసుకోకపోయినా మీరు అమెరికా ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. నేను స్పాన్సర్‌ చేస్తాను. మీ ఖర్చులన్నీ నేనే పెట్టుకుని అమెరికా అంతా చూపిస్తాను. తప్పకుండా రండి మామయ్యా’’ అన్నాడు దరహాస్‌.
సంక్రాంతి పండుగ పర్వదినాల్లో అనురాగ్‌వాళ్ళ వూరు అమృతలూరు వెళ్ళినప్పుడు ‘‘మా అమ్మాయిని నువ్వు పెళ్ళి చేసుకుంటే నీ పిల్లలకూ నీక్కూడా అన్నంముద్దలు పెట్టొచ్చు’’ అంది అమ్మ నవ్వుతూ.
ఆ మాటల్లోనే అమ్మ మనసు అర్థం అయింది. సొంత అన్న కొడుకుకంటే ఆడబిడ్డకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆమె ఆరాటం, పెంచిన మమకారం సుప్రజ అర్థం చేసుకుంది.

                                                                                         * *

డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నప్పుడు తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పేసింది సుప్రజ.
‘‘అనురాగ్‌ను పెళ్ళి చేసుకుంటాను నాన్నా! మీక్కూడా మీ చెల్లెలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉంది. కాకపోతే, తన అన్న కొడుకును కాదని, మేనల్లుడిని అల్లుడిగా చేసుకుంటానంటే అమ్మ ఏమనుకుంటుందోనని మీ భయం. అమ్మ అంటే అంత ప్రేమ మీకు. అమ్మ కూడా అంతే... మీ నిర్ణయానికి ఎదురు చెప్పకూడదన్న నిశ్చయం. మీరంటే అంత గౌరవం అమ్మకు. కన్నకూతురి మీద ఎలాంటి ఒత్తిడీ తీసుకురాకూడదన్నది మీ ఇద్దరి ఆలోచన. ఇక నా విషయానికి వస్తే- దరహాస్‌ అంటే అయిష్టమేమీ లేదు కానీ నాకు అమెరికాలో స్థిరపడాలని లేదు. మీ అందరికీ దూరంగా వెళ్ళలేను. అనురాగ్‌ నాకు అన్నివిధాలా నచ్చాడు’’ చెప్పుకుపోయింది సుప్రజ.

ఆనందంతో గుండె నిండిపోగా, ‘అత్తా... అత్తా’ అంటూ ఆర్తిగా తన చుట్టూ తిరిగే అనురాగ్‌ గుర్తొచ్చి కళ్ళు తడి అవుతుంటే కూతురు నుదురు ముద్దు పెట్టుకుంది వసుమతి.

Source: eenadu

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top