తెలంగాణలో 1000 దాటిన కరోనా కేసులు | FZ News



    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1000 మార్క్ దాటింది. ఆదివారం (ఏప్రిల్ 26) 11 కొత్త కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 1001కి చేరింది. ఈ 11 కేసులూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవుతుండటం గమనార్హం. 75 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకొని ఆదివారం డిశ్చార్జ్ కావడం విశేషం. ఇలాగే కొనసాగితే త్వరలోనే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ కేసులు


రాష్ట్రంలో ప్రస్తుతం 660 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి వెల్లడించిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఆదివారం మరో 9 బాధితులు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు 316 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.

ఆదివారం మరణాలేవీ సంభవించలేదని తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మరణించారు. వీరిలో 18 మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి‌లోనే మరణించారు.

తెలంగాణను దాటేసిన ఏపీ
ఏపీలో కరోనా కేసులు ఇప్పటికే తెలంగాణను దాటేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఆదివారం 81 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1097కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 231 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 835 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.

Source / More Information : telugu.samayam

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top